KTR: కుతుబ్ షాహీల కాలం నాటి సొరంగాన్ని తిరిగి తెరుద్దాం: కేటీఆర్ తో చర్చించిన అసదుద్దీన్ ఒవైసీ!

  • టూంబ్స్ నుంచి గోల్కొండ వరకూ సొరంగం
  • తెరిపిస్తే పర్యాటకులకు ఎంతో ఆకర్షణ
  • త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం
  • కుతుబ్ షాహీ టూంబ్స్ వద్ద భూగర్భ నిర్మాణం
  • శంకుస్థాపన చేసిన మంత్రులు
Re open Secret Route from Golkonda to Kutubsahi Toombs

హైదరాబాద్ ప్రాంతాన్ని పాలించిన కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండ కోట నుంచి తమ వంశీకుల సమాధులున్న ప్రాంతానికి (కుతుబ్ షాహీ టూంబ్స్) రాజులు ఏర్పాటు చేసుకున్న సొరంగ మార్గాన్ని తిరిగి తెరిపించడం ద్వారా టూరిస్టులను విశేషంగా ఆకర్షించ వచ్చని సర్కారు భావిస్తోంది. నిన్న మొత్తం రూ. 45.39 కోట్లతో పర్యాటకుల కోసం భూగర్భ నిర్మాణాన్ని కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ ప్రాంతంలో నిర్మించేందుకు శంకుస్థాపన జరుగగా, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, సొరంగ మార్గాన్ని తిరిగి తెరిపిస్తే, బాగుంటుందని సూచించగా, మంత్రులు ఈ విషయమై చర్చించారు. సమాధుల నుంచి 300 మీటర్ల దూరంలో మొదలయ్యే ఈ సొరంగ మార్గం గోల్కొండ కోటలోని పటాన్ చెరు దర్వాజా వరకూ వెళుతుంది. ఇక కోటకు వచ్చే టూరిస్టులకు ఈ మార్గాన్ని పరిచయం చేయడం ద్వారా వారిని మరింతగా ఆకర్షించవచ్చని మంత్రుల మధ్య ప్రస్తావన వచ్చింది.

ఇక భూగర్భ నిర్మాణం పూర్తయ్యేలోపు సొరంగంపైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ నిర్మాణం దాదాపు 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పూర్తిగా భూమిలోనే ఉంటుంది. పైన స్లాబుపై ఉద్యానవనాలుంటాయి. ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న ఆర్కిటెక్చరల్ సంస్థ 'స్టూడియో లోటస్' డిజైన్ ను అందించింది.

వాస్తవానికి కుతుబ్ షాహీ టూంబ్స్ ప్రపంచ వారసత్వ సంపద కావడంతో, దానికి సమాంతరంగా నిర్ణీత పరిధిలో ఎటువంటి నిర్మాణాలనూ చేపట్టేందుకు వీల్లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే భూగర్భ నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇక ఇక్కడ చిల్ట్రన్ గ్యాలరీలు, భోజన, ఫలహార శాలలు, ఫిల్మ్ స్క్రీనింగ్ గదులు, మల్టీ పర్పస్ హాల్, సావనీర్ షాప్స్, ఓరియంటేషన్ కోర్ట్, గ్యాలరీ కోర్ట్ తదితరాలుంటాయి. టికెట్ కౌంటర్ వద్ద బ్యాగేజీ స్క్రీనింగ్, స్టోరేజ్ సౌకర్యాలను కూడా కల్పిస్తారు. చారిత్రక వస్తువులతో కూడిన చిన్న మ్యూజియం కూడా ఏర్పాటవుతుంది.

More Telugu News