Virat Kohli: బక్కచిక్కిపోతున్నావంటూ మా అమ్మ చాలా బాధపడేది: కోహ్లీ

  • బీసీసీఐ వీడియోలో కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు
  • అమ్మకెప్పుడూ బొద్దుగా కనిపించాలంటూ వివరణ
  • లేకపోతే జబ్బు చేసిందని భావించేదని వెల్లడి
Kohli recollects his mother words

టీమిండియాలోనే కాదు, ప్రపంచంలోని మరే ఇతర క్రికెట్ జట్టులోనూ విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ కు దీటైన ఆటగాడు లేడంటే అతిశయోక్తి కాదు. ఆధునిక తరం క్రికెటర్ అంటే ఎలా ఉండాలో కోహ్లీని చూసి నేర్చుకోవాలి. మైదానంలో పరుగులు పెట్టడం దగ్గర్నుంచి, గంటల కొద్దీ బ్యాటింగ్ చేయడం ఫిట్ నెస్ వల్లే సాధ్యమైందంటూ కోహ్లీ ఎన్నోమార్లు చెప్పాడు. అయితే కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన తొలినాళ్లలో అధిక బరువుతో ఉండేవాడు.

కాలక్రమంలో ఆటపరంగా తాను ఎదగాలంటే ఫిట్ నెస్ ఎంతో ముఖ్యమని గ్రహించిన కోహ్లీ అక్కడి నుంచి అసాధారణమైన రీతిలో కసరత్తులు చేస్తూ తిరుగులేని శారీరక దృఢత్వం సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా, కోహ్లీ కసరత్తులు చేసి కొవ్వును కరిగిస్తూ సన్నబడుతుంటే అతని తల్లి ఎంతో బాధపడేదట. బక్కచిక్కిపోతున్నావంటూ విచారం వ్యక్తం చేసేదని కోహ్లీనే వెల్లడించాడు.

"ఏ తల్లయినా ఇలాగే బాధపడేదని నేను అర్థం చేసుకున్నాను. నేనేమీ తినడంలేదని ఆమె బెంగ పడేది. ఆట పట్ల ఆందోళన చెందుతున్నామని కాకుండా ఆట పట్ల సరైన దృక్పథంతోనే బరువు తగ్గుతున్నామన్నది వాళ్లకు అర్థం కాదు. తల్లులంటే... వాళ్లకు పిల్లలు ఎప్పుడూ బొద్దుగా కనిపించాలంతే. అలా కనిపించకపోతే వాళ్లకేదో జబ్బు చేసిందన్నట్టుగా బాధపడతారు" అంటూ కోహ్లీ తెలిపాడు. బీసీసీఐ కోసం నిర్వహించిన ఓ వీడియోలో కోహ్లీ... సహచర ఆటగాడు మయాంక్ అగర్వాల్ తో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

More Telugu News