Kulbhushan Jadhav: జాదవ్ వ్యవహారంలో పాక్ చేస్తున్నదంతా ఓ బూటకం: భారత్

India alleges Pakistan over Kul Bhushan Jadhav issue
  • గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన కుల్ భూషణ్ జాదవ్
  • మరణశిక్ష విధించిన పాక్
  • జాదవ్ ను రక్షించుకునేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్న భారత్
భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ ను గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ అదుపులోకి తీసుకుని మరణశిక్ష విధించడం తెలిసిందే. పాకిస్థాన్ ఇటీవలే పలుమార్లు జాదవ్ ను కలిసేందుకు భారత్ కు దౌత్యపరమైన అనుమతులు మంజూరు చేసింది. దీనిపై భారత్ స్పందించింది. జాదవ్ వ్యవహారంలో పాక్ వ్యవహారశైలి ఓ ప్రహసనం అని విమర్శించింది. మరణశిక్ష ఎదుర్కొంటున్న కుల్ భూషణ్ జాదవ్ కు అన్ని న్యాయపరమైన అవకాశాలను అడ్డుకుంటోందని ఆరోపించింది.

కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ కేసులో పాకిస్థాన్ వ్యవహరిస్తున్న తీరు ఓ బూటకాన్ని తలపిస్తోందని అన్నారు. దౌత్యపరమైన అనుమతులు ఇస్తున్నామంటూనే పూర్తి ఏకాంతంలో జాదవ్ ను కలిసేందుకు పాక్ అనుమతించలేదని, చివరి ప్రయత్నంగా జూలై 18న జాదవ్ తరఫున రివ్యూ పిటిషన్ దాఖలు చేశామని వెల్లడించారు. అయితే, పవర్ ఆఫ్ అటార్నీ, ఇతర డాక్యుమెంట్లు లేవన్న కారణాలు సాకుగా చూపుతూ ఆ పిటిషన్ ను స్వీకరించలేదని ఓ పాకిస్థానీ లాయర్ తెలిపాడని శ్రీవాస్తవ వివరించారు.  జాదవ్ ను రక్షించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను భారత్ అన్వేషిస్తోందని తెలిపారు.
Kulbhushan Jadhav
India
Pakistan
Arrest
MEA

More Telugu News