నేను ఇంకా కోలుకోలేదు.. తప్పుడు వార్తను ప్రసారం చేశారు: అమితాబ్ బచ్చన్

23-07-2020 Thu 19:21
  • అమితాబ్ కరోనా నుంచి కోలుకున్నారంటూ వార్తలు
  • తనకు నెగెటివ్ రాలేదని ట్వీట్ చేసిన బిగ్ బీ
  • బాధ్యతారహితంగా వ్యవహరించారని వ్యాఖ్య
Amitabh denies testing negetive for Coronavirus

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమితాబ్ కు తాజా కోవిడ్ టెస్టులో నెగెటివ్ వచ్చిందనే వార్తలు వచ్చాయి. దీంతో, ఆయన అభిమానులంతా హ్యాపీగా ఫీలయ్యారు. అయితే, ఈ వార్తలను అమితాబ్ ఖండించారు. టెస్టులో తనకు నెగెటివ్ రాలేదని... తాను కోలుకున్నాననే వార్తలో నిజం లేదని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. బాధ్యతారాహిత్యంగా తప్పుడు వార్తను ప్రసారం చేశారని అసహనం వ్యక్తం చేశారు.

కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఈ నెల 12న అమితాబ్ ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కి కూడా పాజిటివ్ అని కన్ఫామ్ కావడంతో... ఆయన కూడా ఆసుపత్రిలో చేరారు. దీంతో, అభిషేక్ భార్య ఐశ్వర్యరాయ్, కూతురు ఆరాధ్య హోం ఐసొలేషన్ లో గడిపారు. అయితే, రెండు రోజుల తర్వాత వీరిద్దరికి కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో వీరిని కూడా ఆసుపత్రికి తరలించారు. అమితాబ్ భార్య జయా బచ్చన్ కు మాత్రం కరోనా నెగెటివ్ వచ్చింది.

అమితాబ్ కుటుంబానికి కరోనా వచ్చిన నేపథ్యంలో ఆయన బంగ్లాను బీఎంసీ అధికారులు శానిటైజ్ చేశారు. బంగ్లా వెలుపల కంటైన్మెంట్ నివాసంగా బోర్డును ఏర్పాటు చేశారు. మరోవైపు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే, ఎప్పటికప్పుడు అమితాబ్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.