కరోనా కష్టాలు... ఆన్ లైన్ లో రాఖీలు అమ్ముకుంటున్న టీవీ నటి

23-07-2020 Thu 13:22
  • లాక్ డౌన్ తో నిలిచిపోయిన షూటింగులు
  • సీరియళ్లు లేక నటీనటులకు ఆర్థిక ఇబ్బందులు
  • ఉన్న డబ్బంతా ఖర్చు చేసుకున్న వందన విత్లానీ
TV actress Vandana Vithlani sells Rakhis in online due to corona situations

అప్పట్లో జాతీయస్థాయిలో ప్రసారమైన హిందీ సీరియల్ 'సాథ్ నిభానా సాథియా' సీరియల్ లో నటించిన వందన విత్లానీ ఇప్పుడు రాఖీలు అమ్ముకుంటోంది. ఈ సీరియల్ 'కోడలా కోడలా కొడుకు పెళ్లామా' పేరిట తెలుగులోనూ విశేషమైన ప్రజాదరణ పొందింది. ఇందులో కీలకపాత్రలో నటించిన వందన విత్లానీ కరోనా పరిస్థితుల్లో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఆమె కొంతకాలం కిందట 'హమారీ బహు సిల్క్' అనే సీరియల్ లో నటించగా, దానికి సంబంధించిన నిర్మాత లక్ష రూపాయలు బకాయి పడ్డాడట. ఇప్పటివరకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని వందన విత్లానీ వాపోయింది. లాక్ డౌన్ కారణంగా  షూటింగులు నిలిచిపోవడంతో తన వద్ద ఉన్న డబ్బు అయిపోయిందని, దాంతో తనకు తెలిసిన విధంగా రాఖీలు తయారుచేస్తూ వాటిని ఆన్ లైన్ ఆర్డర్ల ద్వారా విక్రయిస్తున్నానని, ఇప్పుడు వాటిపై వచ్చే ఆదాయమే తనకు ఆధారమని వందన వెల్లడించింది. కాగా, వందన భర్త విపుల్ కూడా టీవీ నటుడే అయినా, అతను సైతం లాక్ డౌన్ పరిస్థితుల్లో ఉపాధి లేక ఇంటికే పరిమితమైన పరిస్థితి ఏర్పడింది.