నాలుగేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లే ప్రయత్నం.. దుండగులతో పోరాడి బిడ్డను కాపాడుకున్న తల్లి

23-07-2020 Thu 09:29
  • దేశ రాజధాని ఢిల్లీలో ఘటన
  • అన్న ఎదుగుదలను జీర్ణించుకోలేక కిడ్నాప్ యత్నం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Delhi Woman Fights Off Kidnappers To Save 4 Year Old Daughter

తన నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన కిడ్నాపర్లతో ఓ తల్లి చేసిన సాహసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంగళవారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. తూర్పు ఢిల్లీకి చెందిన చిన్నారి తండ్రి వస్త్రాల వ్యాపారం చేస్తూ కాస్తోకూస్తో సంపాదించుకున్నాడు. దీంతో అతడిపై ద్వేషం పెంచుకున్న సోదరుడు.. అతడి నుంచి డబ్బులు గుంజేందుకు ప్రణాళిక రచించాడు. అందులో భాగంగా అతడి నాలుగేళ్ల కుమార్తెను కిడ్నాప్ చేయాలని భావించి ఇద్దరు కిడ్నాపర్లను రంగంలోకి దింపాడు.

ప్లాన్‌లో భాగంగా బైక్‌పై వస్త్రవ్యాపారి ఇంటికొచ్చిన కిడ్నాపర్లు నీళ్లు కావాలని అతడి భార్యను అడిగారు. ఆమె నీళ్లు తెచ్చేందుకు వెనక్కి తిరగ్గానే చిన్నారిని ఎత్తుకుని బయటకు వచ్చి పారిపోయేందుకు సిద్ధమవుతుండగా, చిన్నారి అరుపులతో అప్రమత్తమైన ఆమె ఒక్కుదుటన బయటకు వచ్చి వారి చేతుల్లోంచి బిడ్డను లాక్కొంది. ఈ క్రమంలో కిడ్నాపర్లతో పెనుగులాట జరిగింది. ప్లాన్ ఫలించకపోవడంతో పరారయ్యేందుకు సిద్ధమైన కిడ్నాపర్లను చూసిన ఇరుగుపొరుగు వారు రోడ్డుకు అడ్డంగా బైకులు పెట్టి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు తప్పించుకున్నారు.

బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాప్ సూత్రధారి అయిన చిన్నారి తండ్రి సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్లు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నారు. కాగా, రూ. 35 లక్షల కోసమే తాను ఈ కిడ్నాప్‌కు ప్లాన్ వేసినట్టు నిందితుడు పోలీసులకు తెలిపాడు.