బాలీవుడ్‌లో కొందరికి పాక్ ఐఎస్ఐతో సంబంధాలు.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

23-07-2020 Thu 09:00
  • నా వద్ద ఆధారాలున్నాయి
  • దేశభక్తి కలిగిన బాలీవుడ్ ప్రముఖులు ఇటువంటి వారి నుంచి దూరంగా ఉండాలి
  • వారిని దేశం నుంచి బహిష్కరించాలి
BJP Leader Baijayant Jay Panda Claims Some Bollywood Celebs Have Links to ISI

బాలీవుడ్‌లోని కొందరు ప్రముఖులకు పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, పార్టీ అధికార ప్రతినిధి బైజయంత్ జే పాండా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ట్వీట్ చేశారు. అయితే, వారెవరన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దేశభక్తి కలిగిన బాలీవుడ్ ప్రముఖులు ఇలాంటి వారితో చాలా అప్రమత్తంగా ఉండాలని పాండా హెచ్చరించారు.

పాక్‌ ఐఎస్ఐతో సంబంధాలు కలిగిన ప్రముఖులపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు, వారిని దేశం నుంచి బహిష్కరించాలని కూడా డిమాండ్ చేశారు. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌పై వరుస ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ పాండా చేసిన ఈ సంచలన ఆరోపణలు బాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి.