TV Artist: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న బుల్లితెర నటి రేఖ

TV Artist Rekha suicide in Guntur
  • రెండు టీవీ సీరియళ్లలో నటించిన రేఖ
  • అవకాశాలు రాకపోవడంతో తిరిగి గుంటూరుకు
  • రియల్ ఎస్టేట్‌లో భర్త నష్టాల పాలవడంతో తీవ్ర నిర్ణయం
అవకాశాలు లేకపోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న భర్త అప్పులపాలవడంతో టీవీ నటి మద్దెల సబీరా, అలియాస్ రేఖ (42) ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన రేఖ నటనపై అభిమానంతో హైదరాబాద్ వచ్చి రెండు టీవీ సీరియళ్లలో నటించారు. అయితే, ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో తిరిగి గుంటూరు వెళ్లిపోయి అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. కుమార్తె పుట్టిన తర్వాత మనస్పర్థలు రావడంతో భర్తతో విడిపోయారు. అనంతరం చైతన్యను వివాహం చేసుకున్నారు.

ప్రస్తుతం విద్యానగర్‌లో ఉంటున్న రేఖ కొన్నాళ్లపాటు వేడుకల్లో పాటలు పాడడం, యాంకరింగ్ చేయడం వంటివి చేశారు. అయితే, గత రెండేళ్లుగా అది కూడా మానేశారు. మరోవైపు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆమె భర్త చైతన్య నష్టాలపాలవడంతో రేఖ కుంగిపోయారు. చుట్టుముట్టిన కష్టాలతో కలత చెందిన ఆమె నిన్న స్నానం చేసేందుకు వెళ్లి బాత్రూములోనే ఆత్మహత్య చేసుకున్నారు.

స్నానానికి వెళ్లిన భార్య ఎంతకీ బయటకు రాకపోవడంతో భర్త పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు పగలగొట్టి చూడగా ఆమె ఉరి వేసుకుని వేలాడుతూ ఉండటం గమనించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
TV Artist
Rekha
Suicide
Guntur District

More Telugu News