వెబ్ సీరీస్ లో రకుల్.. తొలిసారి ద్విపాత్రాభినయం!

22-07-2020 Wed 21:02
  • ముమ్మరంగా సాగుతున్న వెబ్ సీరీస్ నిర్మాణం 
  • కాజల్, సమంత, తమన్నా బాటలో రకుల్
  • ట్విన్స్  గా కనిపించనున్న ముద్దుగుమ్మ
Rakul Preeth Singh to act in web series

స్ట్రీమింగ్ మీడియాకు ఇప్పుడు ప్రాధాన్యత పెరిగిపోతోంది. దాంతో ఓటీటీ ప్లేయర్స్ వైవిధ్యమైన కంటెంట్ కోసం చూస్తున్నాయి. కొత్తదనంతో కూడిన కంటెంట్ దొరికితే భారీ మొత్తాలు వెచ్చించి తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకులు సైతం ఈ డిజిటల్ వేదికకు రావడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇందులో భాగంగా వెబ్ సీరీస్ నిర్మాణం ఎక్కువైంది. భారీ బడ్జెట్టుతో నాణ్యతతో కూడిన వెబ్ సీరీస్ నిర్మాణం వైపు పలువురు దృష్టి సారిస్తున్నారు.

ఇప్పటికే కాజల్, సమంత, తమన్నా వంటి తారలు వెబ్ సీరీస్ లలో నటిస్తూ అక్కడ కూడా తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ కూడా వెబ్ సీరీస్ వైపు వస్తోంది. తాజాగా ఆమె ఓ వెబ్ సీరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

విశేషం ఏమిటంటే, ఇందులో తొలిసారిగా ఆమె ద్విపాత్రాభినయం చేస్తుందనీ, అది కూడా కవలలుగా నటిస్తుందనీ తెలుస్తోంది. ఈ ట్విన్స్ ప్రతి విషయంలోనూ ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారనీ, ఆ వైనం ఆసక్తికరంగా సాగుతుందనీ చెబుతున్నారు. ఓపక్క సినిమాలలో అవకాశాలు తగ్గుతుండడంతో అమ్మడు ముందు జాగ్రత్తగా వెబ్ సీరీస్ లోకి ఎంట్రీ ఇస్తోందన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.