Achyuta Rao: 30 ఏళ్లకు పైగా బాలల హక్కుల కోసం పోరాడిన అచ్యుతరావు ఇకలేరు!

Balala Hakkula Sangham president Achyutha Rao passes away
  • బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు మృతి
  • కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణం
  • కరోనా నుంచి కోలుకున్న కార్టూనిస్ట్ శ్రీధర్
చిన్నారుల హక్కుల పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు కరోనాతో మృతి చెందారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. హైదరాబాద్ మలక్ పేటలో ఉన్న యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ బాలల హక్కులపై అచ్యుతరావు ఎన్నో పోరాటాలు చేశారు. హింసకు గురవుతున్న చిన్నారులకు అండగా నిలిచారు. వెట్టి చాకిరీ, బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. తన జీవితంలో 30 ఏళ్లకు పైగా కాలాన్ని బాలల హక్కుల పరిరక్షణకే వెచ్చించారు. ఆయన మరణం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు అచ్యుతరావు సోదరుడు, 'ఈనాడు' కార్టూనిస్టు అయిన శ్రీధర్ కు కూడా కరోనా సోకింది. మలక్ పేట యశోదా ఆసుపత్రిలో చికిత్స పొంది ఆయన కోలుకున్నారు. ఈరోజు డిశ్చార్జి అయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
Achyuta Rao
Balala Hakkula Sangham
Corona Virus

More Telugu News