Santhoshi: సంతోషికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగ నియామక పత్రాలను అందించిన కేసీఆర్.. త్వరలోనే రూ. 20 కోట్ల విలువైన ఇంటి స్థలం!

  • చైనా సరిహద్దులో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు
  • నేడు ప్రగతి భవన్ కు వచ్చిన సంతోష్ భార్య సంతోషి
  • హైదరాబాద్ పరిసరాల్లోనే ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ ఆదేశం
KCR gives appointment letter to Santhoshi

ఇటీవల భారత్-చైనా సరిహద్దులో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని ఇచ్చింది. దీనికి సంబంధించిన నియామక పత్రాలను సంతోషికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించారు. ఈరోజు 20 మంది కుటుంబసభ్యులతో కలసి సంతోషి ప్రగతి భవన్ కు వచ్చారు. వారందరితో కలిసి కేసీఆర్ భోజనం చేశారు. వారి యోగ క్షేమాలను తెలుసుకున్నారు.

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో కేబీఆర్ పార్కుకు ఎదురుగా ఉన్న రూ. 20 కోట్ల విలువైన 711 గజాల స్థలాన్ని కూడా కేటాయించారు. దీనికి సంబంధించిన పత్రాలను మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా సంతోషికి అందించనున్నారు.

మరోవైపు సంతోషికి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. సంతోషికి సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదురుకునేంత వరకు తోడుగా ఉండాలంటూ తన కార్యదర్శి స్మితా సభర్వాల్ ను సీఎం కోరారు.

More Telugu News