బాలీవుడ్ రీమేక్ పై నాగార్జున దృష్టి!

22-07-2020 Wed 16:41
  • హిందీ చిత్రం 'రైడ్'పై నాగార్జున మక్కువ   
  • యంగ్ డైరెక్టర్ కోసం ప్రయత్నాలు
  • 'వైల్డ్ డాగ్' సినిమాలో ఎన్.ఐ.ఏ ఆఫీసర్
  • ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో సినిమా     
Nagarjuna to remake Hindi film

నాగార్జున తన కెరీర్ మొదటి నుంచీ కూడా కొత్త దర్శకులకి అవకాశాలు బాగా ఇస్తూ వచ్చారు. దాంతోనే ఆయనకు అప్పట్లో వెరైటీ సినిమాలు పడ్డాయి. ఇప్పుడు కూడా కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని, వారితో కలసి పనిచేయాలని ఆయన కోరుకుంటున్నారట. ఈ క్రమంలో ఆమధ్య హిందీలో వచ్చిన 'రైడ్' చిత్రం రీమేక్ లో నటించాలని నాగార్జున భావిస్తున్నారు. అయితే, దీనికి సీనియర్ దర్శకులు కాకుండా యంగ్ డైరెక్టర్ని ఎవర్నైనా తీసుకోవాలని ఆయన ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం ఆ దిశగా యంగ్ డైరెక్టర్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

ఇక ఇదిలావుంచితే, ప్రస్తుతం నాగార్జున సాల్మోన్ దర్శకత్వంలో 'వైల్డ్ డాగ్' అనే చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్.ఐ.ఏ ఆఫీసర్ పాత్రలో ఆయన నటిస్తున్నారు. అలాగే, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఆయన ఓ చిత్రం చేయాల్సివుంది. ఇంకోపక్క, త్వరలో ప్రారంభం కానున్న రియాలిటీ షో 'బిగ్ బాస్ 4' సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు.