Kanna Lakshminarayana: ఇళ్ల నిర్మాణంలో టీడీపీ అవినీతికి పాల్పడితే... ఇళ్ల స్థలాల్లో వైసీపీ అవినీతికి పాల్పడుతోంది: కన్నా లక్ష్మీనారాయణ

  • కేంద్రం సాయంతో లక్షల ఇళ్లను నిర్మించారు
  • వాటిని వెంటనే పేదలకు పంచాలి
  • గవర్నర్ ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాం 
Kanna Lakshminarayana fires on Jagan

దేశంలోని ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలనేది ప్రధాని మోదీ ఆశయమని... ఆ లక్ష్యంతోనే ఏపీకి భారీగా ఇళ్లను మంజూరు చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గత టీడీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వ సాయంతో లక్షల ఇళ్లను నిర్మించారని చెప్పారు. ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి చోటుచేసుకుందంటూ ఆరోపించిన జగన్... సీఎం అయిన వెంటనే ఆ విషయాన్ని మర్చిపోయారని విమర్శించారు. నిర్మాణాలు పూర్తైన లక్షల ఇళ్లను వెంటనే పేదలకు అందించాలని... నిర్మాణం పూర్తి కావాల్సిన 2.30 లక్షల ఇళ్లను పూర్తి చేసి ఇళ్లు లేని వారికి కేటాయించాలని డిమాండ్ చేశారు.

నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను పేదలకు పంచకుండా... ఇళ్ల స్థలాల పేరుతో కాలయాపన చేస్తున్నారని కన్నా విమర్శించారు. ఇళ్ల నిర్మాణంలో టీడీపీ అవినీతికి పాల్పడితే... ఇళ్ల స్థలాల్లో వైసీపీ అవినీతికి పాల్పడుతోందని చెప్పారు. ఇళ్ల స్థలాల పేరిట వైసీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. తమ మాట వినలేదనే కారణంతో నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిరావును బదిలీ చేశారని చెప్పారు.

నిమ్మగడ్డ రమేశ్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నియమించాలని ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని కన్నా తెలిపారు. గవర్నర్ ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News