వైసీపీ ఎమ్మెల్యే ధర్మశ్రీలో మరో కోణం.. సినిమాలో నటిస్తున్న వైనం!

22-07-2020 Wed 14:13
  • చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ స్వతహాగా కళాకారుడు
  • చిన్నప్పటి నుంచి నాటికల్లో నటించిన చరిత్ర
  • తాజాగా 'మోదకొండమ్మ' సినిమాలో వేషం 
YSRCP MLA Karanam Dharmasri acting in a movie

విశాఖ జిల్లా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ స్వతహాగా కళాకారుడు కూడా. చిన్న వయసు నుంచి నటనపై ఆయనకు ఆసక్తి ఉంది. తన స్వగ్రామం కేజే పురంలో పలు నాటకాల్లో నటించి జనాల మన్ననలను పొందారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు హైదరాబాదులో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో అన్నమయ్య పాత్రను పోషించి... అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యేగా ప్రజా కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నప్పటికీ... తనలోని కళాపోషణను ఆయన రుజువుచేసుకుంటున్నారు.

తాజాగా 'మోదకొండమ్మ' అనే సినిమాలో ధర్మశ్రీ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గాజువాకలో జరుగుతోంది. గిరిజనులు ఆరాధించే దైవం మోదకొండమ్మ. ఈ చిత్రంలో పరమశివుడికి, ఆయన తపస్సును భంగం చేయడానికి వచ్చిన మాంత్రికునికి మధ్య సన్నివేశాలను తాజాగా చిత్రీకరించారు. ఈ చిత్రంలో శివుడి పాత్రను ధర్మశ్రీ పోషిస్తున్నారు.