ఓటీటీ ద్వారా తమన్నా చిత్రం విడుదల.. భారీ రేటు!

22-07-2020 Wed 12:40
  • నిర్మాతలను ఆదుకుంటున్న ఓటీటీ ప్లాట్ ఫామ్స్ 
  • దక్షిణాది భాషల్లో రీమేక్ అయిన హిందీ 'క్వీన్'  
  • తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్
  • అమెజాన్ ప్రైమ్ ద్వారా త్వరలో విడుదల  
Thamanna new movie to be released throu OTT

ఈ లాక్ డౌన్ సమయంలో థియేటర్లు మూతబడడంతో కొన్ని చిన్న చిత్రాలను ఓటీటీ ప్లేయర్లు ఎంతగానో ఆదుకుంటున్నాయి. తమ చిత్రాలు పూర్తయి, విడుదలకు సిద్ధం అయిన సమయంలో లాక్ డౌన్ రావడంతో చిన్న చిత్రాల నిర్మాతలకు ఎటూ పాలుపోని పరిస్థితి ఎదురైంది. ఓపక్క చిత్ర నిర్మాణానికి తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండడంతో ఓటీటీ వేదికలు వీరిని ఒడ్డున పడేసే నౌకలుగా కనిపిస్తున్నాయి. దీంతో కొందరు నిర్మాతలు తమ చిత్రాలను డిజిటల్ గా విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలో తమన్నా నటించిన 'దటీజ్ మహాలక్ష్మీ' కూడా ఓటీటీ ద్వారా విడుదలకు సిద్ధమవుతోంది. హిందీలో కంగన రనౌత్ నటించిన 'క్వీన్' చిత్రానికి రీమేక్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో దీనిని నిర్మించారు. ఇదే చిత్రాన్ని తమిళంలో కాజల్ కథానాయికగా 'పారిస్ పారిస్' పేరిట రీమేక్ చేశారు. కాగా, పరుల్ యాదవ్ కథానాయికగా కన్నడలో 'బట్టర్ ఫ్లై' పేరిట, మంజిమా మోహన్ నాయికగా మలయాళంలో 'జామ్ జామ్' పేరిట ఏకకాలంలో దక్షిణాది భాషల్లో రీమేక్ చేశారు. ఈ నాలుగు వెర్షన్లనూ కూడా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ భారీ ప్యాకేజీతో తీసుకుంటున్నట్టు, త్వరలో విడుదల చేయనున్నట్టు సమాచారం.