ఘోరం, అమానుషం.. 'దళితుడికి శిరోముండనం' ఘటనపై ఎంపీ రఘురామకృష్ణ రాజు

22-07-2020 Wed 10:34
  • ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్న ఎంపీ 
  • ఎస్సై అరెస్ట్, ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు
  • ఎస్సై, వైసీపీ నేత కవల కృష్ణమూర్తి సహా ఏడుగురిపై అట్రాసిటీ కేసు
MP Raghurama Krishna Raju Responded about Sitanagaram Issue

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్‌లో దళిత యువకుడికి శిరోముండనం ఘటనపై ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. దీనిని అమానుష, ఘోరమైన ఘటనగా అభివర్ణించిన ఎంపీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ఘటనపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు, ఈ కేసులో ట్రైనీ ఎస్సై ఫిరోజ్ షాను పోలీసులు అరెస్ట్ చేశారు. గత రాత్రి పది గంటల సమయంలో ఎస్సైని అదుపులోకి తీసుకున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే, మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఎస్సై, వైసీపీ నేత కవల కృష్ణమూర్తితో పాటుగా ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ సత్యనారాయణరావు తెలిపారు.