Bengalore: ఇక లాక్ డౌన్ పెట్టే ప్రసక్తే లేదు... ప్రజలదే బాధ్యతన్న యడియూరప్ప

  • బెంగళూరులో 14 నుంచి లాక్ డౌన్
  • నిబంధనలతో వైరస్ కట్టడి కాబోదన్న సీఎం  
  • టెస్టింగ్, చికిత్సలపై దృష్టిని సారిస్తామని వ్యాఖ్య
Yedeyurappa Clarifies that No More Lock Down in Bengalore

కంటెయిన్ మెంట్ జోన్లు మినహా మిగతా బెంగళూరు నగరంలో నేటితో సంపూర్ణ లాక్ డౌన్ ముగియనుండగా, ఇకపై ప్రజలదే బాధ్యతని, వారే కరోనా వ్యాపించకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం రాత్రనక, పగలనక పనిచేసిందని వెల్లడించిన ఆయన, వైరస్ కట్టడి ఇక తమ చేతుల్లో ఏమీలేదని అన్నారు.

కాగా, జూలై 14 నుంచి నగరంలో లాక్ డౌన్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా కేసులు తగ్గలేదు. ఇప్పటివరకూ బెంగళూరులో 33 వేలకు పైగా కరోనా కేసులు వచ్చాయి. "నేను ఒకటే చెప్పదలచుకున్నాను. ఇక బెంగళూరులో లాక్ డౌన్ ఉండదు. రాష్ట్రంలోనూ అమలు కాబోదు. కేవలం కంటెయిన్ మెంట్ జోన్లలో మాత్రమే నిబంధనలు అమలవుతాయి. ప్రతి ఒక్కరూ తమవంతుగా సహకరించాలని కోరుకుంటున్నాను" అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

లాక్ డౌన్ ను నగరంలో మరో 15 రోజులు పొడిగించే అవకాశాలు ఉన్నాయని గత మూడు, నాలుగు రోజులుగా సోషల్ మీడియాతో పాటు పత్రికల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో యడియూరప్ప ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలావుండగా, గత శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన, లాక్ డౌన్ తో వైరస్ ను కట్టడి చేయలేమని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 65 సంవత్సరాలు దాటిన వారిలో వైరస్ ను ట్రాక్ చేయడం, టెస్టింగ్, చికిత్సలపై మరింత దృష్టిని కేంద్రీకరిస్తున్నామని ఆయన అన్నారు.

నగరంలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు, మౌలిక వసతులతో పోలిస్తే, ఇప్పుడున్న కేసుల సంఖ్య ప్రభుత్వంపై ఒత్తిడిని పెట్టడం లేదని ఆయన అన్నారు. కేవలం అంబులెన్స్ ల విషయంలోనే ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.

More Telugu News