వరవరరావు నిర్బంధానికి నిరసనగా 25న తెలంగాణ బంద్.. పిలుపునిచ్చిన మావోయిస్టులు

22-07-2020 Wed 07:34
  • వరవరరావు సహా అరెస్ట్ చేసిన 12 మందిని బేషరతుగా విడుదల చేయాలి
  • వరవరరావు విడుదలకు కేసీఆర్ చొరవ చూపడం లేదు
  • బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామిక శక్తులపై దాడి
Maoists Called On Telangana Bandh On 25th

ఈ నెల 25న శనివారం తెలంగాణ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. విరసం నేత వరవరరావు సహా 12 మంది ప్రజా సంఘాల కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (మావోయిస్టు) పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ డిమాండ్ చేశారు. అలాగే, అడవుల నుంచి గ్రేహౌండ్స్ బలగాలను ఉపసంహరించుకోవాలన్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 25 తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్టు పేర్కొన్నారు.

వరవరరావు అరెస్టు కుట్రలో మోదీ, అమిత్ షా, కేసీఆర్ ఉన్నారని జగన్ ఆరోపించారు. ఆయన విడుదలకు చొరవ చూపాలంటూ పలువురు కోరినా కేసీఆర్ పెడచెవిన పెట్టారని విమర్శించారు. వరవరరావు సహా అరెస్ట్ చేసిన 12 మందిపై నక్సల్స్ ముద్ర వేశారని, బీమాకోరెగాం ఘటనలో తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. అరెస్ట్ చేసిన అందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే విప్లవ, ప్రజాస్వామిక శక్తులపై అణచివేత ప్రారంభమైందన్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బూటకపు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.