నేడు వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి, మోపిదేవి, అయోధ్య ప్రమాణ స్వీకారం

22-07-2020 Wed 06:32
  • రాజ్యసభకు ఇటీవల 61 మంది సభ్యుల ఎన్నిక
  • వ్యక్తిగత కారణాల వల్ల ప్రమాణ స్వీకారానికి నత్వానీ దూరం
  • పిల్లి, మోపిదేవి స్థానంలో ఏపీలో నేడు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
YSRCP Rajya Sabha Members will Take Oath Today

ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన 61 మంది సభ్యుల్లో నేడు చాలామంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో వైసీపీ సభ్యులు కూడా ఉన్నారు. ఆ పార్టీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డితోపాటు పరిమళ్ నత్వానీ ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరిలో నత్వానీ తప్ప మిగతా ముగ్గురు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నత్వానీ మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నారని, ఆయన మరో రోజు ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
 
మరోవైపు, ఏపీ మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల రాజీనామాలతో ఖాళీ అయిన మంత్రి పదవులను తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజులతో భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం 1:29 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్టు సమాచారం.