ఏపీలో ఆటవిక పాలన మళ్లీ వచ్చింది... పోలీసుల సమక్షంలోనే గుండు కొట్టారు: చంద్రబాబు

21-07-2020 Tue 18:36
  • అక్రమాలను ప్రశ్నించడమే నేరమైందా అంటూ చంద్రబాబు ఆగ్రహం
  • ఓ దళితుడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆవేదన
  • వరప్రసాద్ కు అండగా ఉంటామని వెల్లడి
Chandrababu responds on Seethanagaram incident

ఇసుక అక్రమ తవ్వకాలను  ప్రశ్నించిన వరప్రసాద్ అనే దళితుడ్ని వైసీపీ నేతలు తీవ్రంగా అవమానించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్ లో పోలీసుల సమక్షంలోనే వరప్రసాద్ కు గుండు కొట్టారని చంద్రబాబు వెల్లడించారు. అప్పటికే పోలీసులు ఆ దళితుడ్ని చితగ్గొట్టారని తెలిపారు. ఓ దళితుడి ఆత్మగౌరవాన్ని దారుణాతిదారుణంగా దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ఆటవిక పాలన మళ్లీ వచ్చిందని ఈ ఘటనతో తేటతెల్లమైందని ట్విట్టర్ లో స్పందించారు.

ఆ ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలను ప్రశ్నించడమే వరప్రసాద్ చేసిన నేరమైందని ఆక్రోశించారు. "ఏపీలో పోలీసులకు ఏమైంది? అవినీతిపరులైన అధికార పక్ష నేతల చేతిలో వాళ్లు ఎందుకు కీలుబొమ్మలా మారారు? ఇది నిజంగా తీవ్రస్థాయిలో హక్కుల ఉల్లంఘనే. ఈ ఘటనలో వరప్రసాద్ కు టీడీపీ అండగా ఉంటుంది. ఈ అనాగరిక చర్యకు పాల్పడిన వారికి కచ్చితంగా శిక్ష పడేలా చూస్తాం" అంటూ చంద్రబాబు ట్వీట్లు చేశారు.