ఆలయాల హుండీలు, భక్తుల కానుకల డబ్బును అమ్మఒడికి ఇవ్వలేదు: మల్లాది విష్ణు వివరణ

21-07-2020 Tue 18:26
  • దేవాదాయశాఖ నిధులను అమ్మఒడికి మళ్లించారంటూ బీజేపీ విమర్శలు
  • రాష్ట్ర బడ్జెట్ నుంచే నేరుగా నిధులను కేటాయించారన్న మల్లాది విష్ణు
  • పూర్తి వివరాలను తెలుసుకుని మాట్లాడాలని హితవు
Funds to Amma Odi is directly allocated from state budget says Malladi Vishnu

అమ్మఒడి పథకానికి దేవాదాయశాఖ నిధులను మళ్లించారంటూ బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, విష్ణువర్ధన్ రెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మఒడి నిధుల గురించి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు. పరిజ్ఞాన లోపంతో కన్నా, విష్ణువర్ధన్ రెడ్డి అనవసరమైన విమర్శలు చేస్తున్నారని అన్నారు.

ఈ పథకానికి ఆలయాల హుండీలు, భక్తుల కానుకల నుంచి నిధులను ఇచ్చారని చెప్పడం దారుణమని మల్లాది విష్ణు చెప్పారు. బ్రాహ్మణ కార్పొరేషన్ దేవాదాయ శాఖలో భాగమైనంత మాత్రాన నిందలు వేయడం తగదని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ నుంచే అమ్మఒడి పథకానికి నేరుగా నిధులను కేటాయించారని చెప్పారు. పూర్తి వివరాలను తెలుసుకుని మాట్లాడాలని... లేకపోతే అభాసుపాలవుతారని అన్నారు.