ఆత్మహత్యా లేక హత్యా..!... సుశాంత్ సింగ్ రాజ్ పుత్ విషాదాంతంపై సినిమా

21-07-2020 Tue 15:54
  • 'సూసైడ్ ఆర్ మర్డర్' పేరిట సినిమా
  • పోస్టర్ విడుదల చేసిన నిర్మాత విజయ్ శేఖర్ గుప్తా
  • సెప్టెంబరులో షూటింగ్
Movie announced on Sushant Singh Rajput end

ఇటీవలే బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోగా, ఆయన బలవన్మరణానికి ఇప్పటికీ నిర్దిష్ట కారణాలు వెల్లడి కాలేదు. కొందరు ఇది హత్య అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, సుశాంత్ మృతిని ఇతివృత్తంగా తీసుకుని బాలీవుడ్ నిర్మాత విజయ్ శేఖర్ గుప్తా 'సూసైడ్ ఆర్ మర్డర్' పేరిట సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ కూడా రిలీజైంది. ఇందులో సుశాంత్ పాత్రను ఉత్తరప్రదేశ్ కు చెందిన సచిన్ తివారీ పోషిస్తున్నాడు. చూడ్డానికి సుశాంత్ లా కనిపించే సచిన్ తివారీకి ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదని నిర్మాత విజయ్ శేఖర్ గుప్తా వెల్లడించారు.

ప్రస్తుతానికి సగం స్క్రిప్టు పూర్తయిందని, సెప్టెంబరులో షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు. తమ సినిమా చూస్తే బాలీవుడ్ లో బంధుప్రీతి, సినీ మాఫియాపై ఉన్న సందేహాలు తీరతాయని అన్నారు. ఇందులో సుశాంత్ వ్యవహారమే కాకుండా, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కొని ఆత్మహత్యకు పాల్పడిన మరికొందరి జీవితాలను కూడా చూపిస్తున్నామని పేర్కొన్నారు.