రేపు ఏపీ మంత్రివర్గ విస్తరణ... కొత్తమంత్రులతో ప్రమాణస్వీకారం

21-07-2020 Tue 15:21
  • మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు
  • మోపిదేవి, సుభాష్ చంద్రబోస్ ల స్థానంలో కొత్త మంత్రులు
  • ఇటీవలే రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి, సుభాష్ చంద్రబోస్
Cabinet expansion in AP tomorrow

ఏపీలో రేపు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. అందుకు ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం 1.29 గంటలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ల స్థానంలో మరో ఇద్దరు కొత్తమంత్రులతో రేపు మధ్యాహ్నం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. బుధవారం ఒంటిగంటకు సీఎం జగన్ రాజ్ భవన్ చేరుకుని కొత్త మంత్రుల ప్రమాణస్వీకారంలో పాలుపంచుకుంటారు.

ఇప్పటివరకు మంత్రిగా ఉన్న మోపిదేవి, డిప్యూటీ సీఎంగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు ఎన్నికైనందున వారు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వీరిస్థానంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు మంత్రి పదవులు చేపడతారని తెలుస్తోంది. అటు మంత్రివర్గ విస్తరణలో భాగంగా ధర్మాన కృష్ణదాస్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.