గ్రీన్ ఇండియా చాలెంజ్: మొక్క నాటి.. దానికి నామకరణం కూడా చేసిన అనుపమ పరమేశ్వరన్!

21-07-2020 Tue 14:19
  • కల్యాణి ప్రియదర్శన్ చాలెంజ్ స్వీకరించిన అనుపమ
  • బ్రెజిలియన్ మల్బరీ మొక్క నాటానని వెల్లడి
  • దానికి కల్యాణి అని పేరుపెట్టానని వివరణ
Anupama Parameswaran participates into Green India Challenge

టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో యువ హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ కూడా పాలుపంచుకుంది. మరో హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ విసిరిన చాలెంజ్ స్వీకరించిన అనుపమ తన నివాసంలో ఓ మొక్క నాటింది. అంతేకాదు, ఆ మొక్కకు 'కల్యాణి' అని పేరు పెడుతున్నానని, అందుకు తగిన కారణాలున్నాయంటూ తనను నామినేట్ చేసిన కల్యాణి ప్రియదర్శన్ ను సరదాగా కవ్వించింది. తాను నాటిన మొక్క 'బ్రెజిలియన్ మల్బరీ' అని అనుపమ వెల్లడించింది.

ఇటీవలే తమకు చెందిన స్థలంలో 25 మొక్కలు నాటామని, కానీ ప్రస్తుతం తామున్న ప్రదేశం కంటైన్మెంట్ జోన్ లో ఉందని, తాము ఉంటున్న చోట ఒకటికి మించి ఎక్కువ మొక్కలు నాటే అవకాశం లేకపోవడంతో ఒక్క మొక్కే నాటానని వివరించింది. త్వరలోనే మిగతా మొక్కలు కూడా నాటుతానని తెలిపింది. ఆపై గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా శోభితా ధూళిపాళ్ల, నివేదా థామస్, అహనా కృష్ణ, గౌతమి నాయర్, కాళిదాస్ జయరామ్, పద్మసూర్య, రాజీషా విజయన్ తదితరులను నామినేట్ చేసింది.