ఆ న్యాయవాది ఇంటికి అర్ధరాత్రి ఎందుకు వెళ్లారు?: సర్కారును ప్రశ్నించిన దేవినేని ఉమ

21-07-2020 Tue 13:59
  • న్యాయవాదిని ఎక్కడికి తీసుకెళ్లారంటూ నిలదీసిన ఉమ
  • ఎక్కడ ఉంచారంటూ ఆగ్రహం
  • రాజప్రాసాదానికి వినబడుతున్నాయా అంటూ వ్యాఖ్యలు
Devineni Uma responds on a lawyer detention

పైలా సుభాష్ చంద్రబోస్ అనే న్యాయవాదిని అర్ధరాత్రి అతడి ఇంటి నుంచి పోలీసులు తీసుకెళ్లడంపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ స్పందించారు. చట్టనిబంధనలు పాటించకుండా, అధికారిక ఉత్తర్వులు లేకుండా ఓ వ్యక్తి ఇంటికి అర్ధరాత్రి ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నించారు. అసలు ఆ న్యాయవాదిని ఎందుకు తీసుకెళ్లారు? ఎక్కడ ఉంచారు అంటూ నిలదీశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వమే న్యాయవాదిని వేధిస్తే సామాన్యుల గతేమిటని న్యాయస్థానం ప్రశ్నిస్తోందని, ఈ మాటలు తాడేపల్లి రాజప్రాసాదానికి వినబడుతున్నాయా జగన్ గారూ... అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు.

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన పైలా సుభాష్ చంద్రబోస్ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సుభాస్ చంద్రబోస్ తన మిత్రుడు మామిడి రాజుపై పోలీసులు దాడి చేశారంటూ, దాన్ని మెడికో లీగల్ కేసుగా నమోదు చేయించాడు. అయితే మెడికో లీగల్ కేసు నమోదు చేయించే క్రమంలో సుభాష్ చంద్రబోస్ తనపై దాడి చేశాడని స్థానిక ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు అర్ధరాత్రి వేళ సుభాష్ చంద్రబోస్ ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది.

దీనిపై సుభాష్ చంద్రబోస్ భార్య ప్రియ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారంటూ ఫిర్యాదు చేశారు.