అమూల్ తో చేయి కలిపిన ఏపీ ప్రభుత్వం... మహిళల జీవితాలు మారిపోతాయన్న సీఎం జగన్

21-07-2020 Tue 13:41
  • మహిళా పాడిరైతులు ఆర్థికంగా ఎదుగుతారన్న సీఎం
  • ఒప్పందంపై సంతకాలు చేసిన ఏపీ ప్రభుత్వం, అమూల్
  • ఏపీ పాడిరైతులకు మెరుగైన ధర దక్కే అవకాశం
AP Government signs MoU with Amul

భారతదేశ డెయిరీ రంగంలో అగ్రగామిగా ఉన్న అమూల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర మహిళల జీవితాలను మార్చే క్రమంలో ఈ ఒప్పందం ఓ గొప్ప అడుగు అని సీఎం జగన్ పేర్కొన్నారు. మహిళా పాడిరైతులు ఆర్థికంగా, తద్వారా సామాజికంగా ఎదగడానికి ఈ ఒప్పందం ఉపకరిస్తుందని తెలిపారు. ఇకపై ప్రభుత్వ సహకార డెయిరీలకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నామని, డెయిరీ రంగంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏపీ ముఖద్వారంలా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సీఎం జగన్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై ప్రభుత్వం తరఫున స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్ సంస్థ తరఫున చెన్నై జోనల్ హెడ్ రాజన్ సంతకాలు చేశారు. కాగా, ఈ ఒప్పందంతో ఏపీ పాడిరైతులకు మెరుగైన ధర దక్కడమే కాకుండా, వినియోగదారులకు అందుబాటు ధరల్లో నాణ్యమైన పాల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలోని సహకార సంఘాల డెయిరీలకు ప్రపంచస్థాయి డెయిరీ టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చే వీలుంది. విస్తారమైన మార్కెటింగ్ అవకాశాలు ఏర్పడతాయి.