వరవరరావు పరిస్థితి సీరియస్ గా ఉంది.. కుటుంబసభ్యుల మధ్య చనిపోయేలా చూడండి: బాంబే హైకోర్టుకు న్యాయవాది విన్నపం
- వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమించింది
- విచారణను ఆయన ప్రభావితం చేయలేరు
- బెయిల్ మంజూరు చేయండి
వరవరరావు ఆరోగ్యం చాలా విషమంగా ఉందని... మరికొన్ని రోజులు మాత్రమే ఆయన బతికే అవకాశం ఉందని కోర్టుకు సుదీప్ తెలిపారు. ఒకవేళ ఆయన చనిపోతే... కుటుంబసభ్యుల మధ్య ఆయన చనిపోయేలా చూడాలని విన్నవించారు. ఈ వయసులో విచారణను ఆయన ప్రభావితం చేసే అవకాశాలు ఏమాత్రం లేవని... ఈ విషయంలో ఎన్ఐఏకు కూడా భిన్నాభిప్రాయాలు లేవని చెప్పారు. కరోనా కూడా సోకడంతో ఆయన పరిస్థితి పూర్తిగా విషమించిందని తెలిపారు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ... వరవరరావును చూసేందుకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పారు. కోవిడ్ బాధితులను ఎవరూ కలవకూడదని అన్నారు.
ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, కొంత దూరం నుంచైనా వరవరరావును కుటుంబసభ్యులు చూసే అవకాశం ఉందా? అని ప్రశ్నించింది. బుధవారంలోగా తమకు సమాధానం చెప్పాలని ఆదేశించింది.