Revanth Reddy: ఎంజీఎం ఆసుపత్రి వద్ద వర్షంలో ఇలా శవాన్ని వదిలేశారు: ఫొటో పోస్ట్ చేసి, విమర్శలు గుప్పించిన రేవంత్‌ రెడ్డి

  • 'కరోనా కథలు 2..' అంటూ రేవంత్‌ విమర్శలు
  • కరోనాను ఎదుర్కోవడంలో గొప్పలు చెబుతున్నారు
  • ఆచరణ మాత్రం శూన్యం
revanth reddy fires on kcr and ktr

'కరోనా కథలు 2..' అంటూ తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'పొంకనాల పోశిగానికి మూడు ఎడ్లు ముప్పై ఆరు దొడ్లు..! అన్నట్టుంది తండ్రి కొడుకుల భాగోతం... కరోనాను ఎదుర్కోవడంలో గొప్పలు చెబుతున్నా ఆచరణ మాత్రం శూన్యం.. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వర్షానికి శవాన్ని వదిలేసిన వైనం' అని ఆయన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా ఓ పత్రికలో ఇందుకు సంబంధించి వచ్చిన ఫొటోను రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో  సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు స్ట్రెచర్‌పై ఓ మహిళ మృతదేహం వర్షంలో తడిసిపోయిందని అందులో పేర్కొన్నారు. కరోనా భయంతో ఆమె మృతదేహాన్ని అలా వదిలేశారని తెలిపారు. హన్మకొండకు చెందిన ఆ మహిళ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌కు వచ్చి కరోనా‌ పరీక్ష చేయించుకోగా, ఆమెకు నెగెటివ్‌ వచ్చిందని చెప్పారు. ఆదివారం తిరిగి ఆమె హన్మకొండకు వచ్చిందని, సోమవారం మధ్యాహ్నం ఆమెకు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారని చెప్పారు.

పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని చెప్పడంతో ఆమె మృతదేహాన్ని స్ట్రెచర్‌పై ఆసుపత్రి బయటకు తీసుకొచ్చారని, వర్షం రావడంతో కుటుంబ సభ్యులు సైతం మృతదేహాన్ని అక్కడే వదిలి పక్కనున్న షెడ్డులోకి వెళ్లారని చెప్పారు. దీంతో ఆ మృతదేహం అరగంట సేపు వర్షంలోనే ఉండిపోయిందని,  కరోనా‌ ఉందేమోనన్న అనుమానంతోనే పక్కకు తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాలేదని పోలీసులు చెప్పారు. అనంతరం వర్షం ఆగిపోయాక అంబులెన్స్‌లో ఎక్కించి, అక్కడి నుంచి శ్మశానవాటికకు తీసుకెళ్లారని వివరించారు.

More Telugu News