యువతి వద్దకు వచ్చి నిలబడిన ఎలుగుబంటి... వీడియో వైరల్

21-07-2020 Tue 11:01
  • మెక్సికోలో ఘటన
  • కదలకుండా నిలిచిపోయిన యువతి
  • చివరకు ఎలుగుబంటితో సెల్ఫీ
This girl has nerves of steel

తన స్నేహితురాలితో కలిసి అడవిలో సరదాగా వాకింగ్ చేయడానికి వచ్చిన ఓ యువతికి భయానక అనుభవం ఎదురైంది. ఓ ఎలుగుబంటి ఆమె వద్దకు వచ్చి నిలబడింది. దీంతో కదిలితే ఆ ఎలుగుబంటి దాడి చేసే అవకాశమున్న నేపథ్యంలో ఆమె కదలకుండా నిల్చున్న చోటే స్థాణువులా ఉండిపోయింది.

దీంతో ఆ యువతిని తాకుతూ ఎలుగుబంటి కాసేపు అక్కడే వుంది. ఆమె పక్కనే తిరుగుతూ ఎలుగుబంటి వాసన చూసింది. ఆ సమయంలో తన చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండడంతో ఆ యువతి ఎలుగుబంటితో కలిసి సెల్ఫీ కూడా తీసుకుంది. చివరకు ఆ ఎలుగు బంటి ఆమెను ఏమీ చేయకుండా అక్కడి నుంచి ముందుకు వెళ్లసాగింది.

దీంతో ఆ యువతి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన మెక్సికో లోని చిపిన్క్యూ ఎకోలాజికల్ పార్క్ లో చోటు చేసుకుంది. ఈ దృశ్యాలను ఆ పార్కుకు వచ్చిన కొందరు తమ స్మార్ట్‌ఫోన్లలో తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఎలుగుబంటి బారిన పడకుండా ఆ యువతి ధైర్యంగా నిలబడిన తీరు పట్ల నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎలుగుబంటిని చూసి పరుగులు తీసి ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా ఆమె చూపిన సమయస్ఫూర్తి బాగుంందని కామెంట్లు చేస్తున్నారు.