Plasma Donar: ప్లాస్మా దానం చేస్తానంటూ 200 మందిని మోసగించిన యువకుడికి బేడీలు

  • సోషల్ మీడియా ద్వారా బాధితులకు ఎర
  • తాను వచ్చేందుకు రవాణా, ఇతర ఖర్చుల కోసం డబ్బులు పంపాలని అభ్యర్థన
  • ఖాతాలో డబ్బులు పడగానే ఫోన్ స్విచ్ఛాఫ్
Man cheated people in the name of plasma donor

ప్లాస్మా దానం పేరుతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 200 మందిని మోసం చేసిన యువకుడికి హైదరాబాద్ పోలీసులు అరదండాలు వేశారు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పోనుగూటివలసకు చెందిన రెడ్డి సందీప్ (25) 2016లో డిగ్రీ పూర్తి చేశాడు. ఉద్యోగాల కోసం చేసిన ప్రయత్నం విఫలం కావడంతో చోరీలబాట పట్టాడు. విశాఖపట్టణంలోని ద్వారక, రెండో పట్టణ పోలీసుస్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడి అరెస్టయ్యాడు. ఆ తర్వాత బెయిలుపై బయటకు వచ్చాడు.

జైలు నుంచి బయటకు వచ్చాక కొవిడ్ కారణంగా ప్లాస్మా దానానికి డిమాండ్ పెరిగినట్టు సందీప్ గుర్తించాడు. దీనిని అందివచ్చిన అవకాశంగా మార్చుకుని ప్లాస్మా డోనర్ పేరుతో మోసాలకు తెరతీశాడు. సోషల్ మీడియాలో ప్లాస్మా దాతల కోసం ఇచ్చిన ప్రకటనలు చూసి వారికి ఫోన్ చేసేవాడు. తాను ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నానని, తన బ్లడ్ గ్రూప్ కూడా మీకు కావాల్సిందేనంటూ వారికి ఫోన్ చేసి నమ్మబలికేవాడు. అయితే, తాను శ్రీకాకుళం నుంచి వచ్చేందుకు రవాణా, ఇతర ఖర్చుల కోసం కొంత డబ్బు కావాలని కోరేవాడు. బాధితులు నమ్మి అతడి ఖాతాలో డబ్బులు వేసిన వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేవాడు. ఇలా రెండు రాష్ట్రాల్లోని దాదాపు 200 మందిని మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు.

అతడి చేతిలో మోసపోయిన హైదరాబాద్‌కు చెందిన బాధితులు పంజాగుట్ట, రాంగోపాల్‌పేట, బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్లతోపాటు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిన్న నిందితుడిని అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.

More Telugu News