సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో రామ్ చరణ్ ప్రాజక్ట్

21-07-2020 Tue 09:12
  • 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' చిత్రాలలో నటిస్తున్న చరణ్ 
  • లాక్ డౌన్ లో పలు కథలు విన్న మెగా హీరో
  • వెంకీ కుడుముల కథకు గ్రీన్ సిగ్నల్
Ram Charan to work with Venky

మెగా హీరో రామ్ చరణ్ నటించే తదుపరి సినిమా ఏది? అన్న విషయంపై ఇంతవరకు ప్రకటన ఏదీ రాలేదు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని పూర్తిచేయాల్సివుంది. అలాగే, మరోపక్క కొరటాల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న 'ఆచార్య' చిత్రంలో కూడా ప్రత్యేక పాత్రను ఆయన పోషించాల్సివుంది. ఈ రెండూ పూర్తయ్యాక తను చేయాల్సిన తదుపరి చిత్రం ఏమిటన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.  

ఈ లాక్ డౌన్ సమయంలో పలువురు దర్శకులు చెప్పిన కథలను ఆయన విన్నప్పటికీ, ఏదీ ఆయనకు అంతగా నచ్చలేదట. ఈ క్రమంలో 'చలో', 'భీష్మ' చిత్రాలతో సక్సెస్ కొట్టిన దర్శకుడు వెంకీ కుడుముల ఇటీవల చెప్పిన కథ చరణ్ కు బాగా నచ్చిందని అంటున్నారు. తాజాగా వెంకీ పూర్తి స్క్రిప్టును కూడా తయారుచేసి చరణ్ చేత ఓకే చేయించుకున్నాడని అంటున్నారు. దీంతో చరణ్ నటించే తదుపరి చిత్రం కచ్చితంగా ఇదే అవుతుందని సమాచారం. పైగా, ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మిస్తారని తెలుస్తోంది.