ఏపీలో కరోనా ఉగ్రరూపం... ఒక్కరోజులో 54 మంది మృతి, 4,074 మందికి పాజిటివ్

20-07-2020 Mon 19:01
  • ఏపీలో 50 వేల మార్కు దాటిన కరోనా కేసులు
  • 696కి చేరిన మరణాలు
  • ఇవాళ 1,335 మంది డిశ్చార్జి
Corona spreads with intensity in AP

ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. ఒక్కరోజు వ్యవధిలోనే 4,074 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1086 కేసులు రావడం అక్కడి పరిస్థితికి నిదర్శనం. అటు, గుంటూరు (596), కర్నూలు (559) జిల్లాల్లోనూ భారీగా కేసులు వెల్లడయ్యాయి.

ఈ క్రమంలో ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేల మార్కు దాటింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 53,724 కేసులు నమోదయ్యాయి. ఇక, మరణాల సంఖ్య కూడా అదే రీతిలో పెరుగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 54 మంది మృత్యువాత పడ్డారు. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 696కి పెరిగింది. ఇవాళ 1,335 మందిని డిశ్చార్జి చేయగా, ఇంకా 28,800 మంది చికిత్స పొందుతున్నారు.