Vishnu Vardhan Reddy: హుండీల్లో వేసే డబ్బును ఇతర పథకాలకు మళ్లించడం సిగ్గుచేటు: ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజం

  • జీవో-18 ద్వారా నిధులు మళ్లించారన్న బీజేపీ నేత
  • ఆ హక్కు మీకెక్కడిది అంటూ సర్కారుపై ఆగ్రహం
  • నిధుల మళ్లింపు ప్రభుత్వానికి అలవాటుగా మారిందని వ్యాఖ్యలు
BJP leader Vishnuvardhan Reddy slams AP Government on Endowment funds

బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దేవాదాయశాఖకు చెందిన రూ.25 కోట్ల నిధులను జీవో-18 ద్వారా అమ్మఒడి పథకానికి మళ్లించారని, ఆ హక్కు మీకెక్కడిది? అంటూ సర్కారును ప్రశ్నించారు. దేవాదాయ శాఖ నిధులను వేరే పథకాలకు మళ్లించడాన్ని బీజేపీ ఖండిస్తోందని పేర్కొన్నారు. నిధులు మళ్లించడం వైసీపీ ప్రభుత్వానికి ఓ అలవాటుగా మారిందని విమర్శించారు.

"భక్తులు ఎంతో ఆరాధనతో తమ డబ్బును హుండీల్లో వేస్తారు, దేవాలయ అభివృద్ధి, ధర్మపరిరక్షణ కోరుకుంటూ వారు హుండీలో కానుకలు సమర్పించుకుంటారు. అలాంటి దేవాదాయ శాఖ నిధులను ఇతర శాఖలకు బదలాయించడం సిగ్గుచేటు" అని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి దేవాదాయశాఖకు ఏమీ ఇవ్వనప్పుడు, భక్తులు ఇచ్చిన సొమ్ము తీసుకునే హక్కు మీకెక్కడిది అంటూ నిలదీశారు.

వైసీపీ ప్రభుత్వం హిందూ ఆలయాల విషయంలోనే ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోందని, ఇతర మతాలకు చెందిన విషయాల్లో ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఉందా? అంటూ సర్కారును ప్రశ్నించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ విష్ణువర్ధన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News