అయోధ్య రామాలయం నిర్మాణానికి విరాళం ఇచ్చి మోదీకి లేఖ రాసిన రఘురామకృష్ణరాజు

20-07-2020 Mon 13:30
  • ఆలయ నిర్మాణానికి 3 నెలల జీతాన్ని విరాళమిచ్చిన రఘురాజు
  • ప్రధాని అకౌంట్ కు జమ
  • భూమిపూజ కోసం కోట్లాది హిందువులు ఎదురుచూస్తున్నారంటూ మోదీకి లేఖ
Raghu Ramakrishna Raju writes letter to Modi

అయోధ్యలోని రామాలయం నిర్మాణానికి సర్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. వచ్చే నెల 5వ తేదీన ఆలయ నిర్మాణానికి భూమిపూజ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణానికి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు విరాళం ఇచ్చారు. ప్రధానమంత్రి అకౌంట్ కు మూడు నెలల జీతాన్ని జమ చేశారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా, ఉడతాభక్తిగా ఈ విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. రామాలయం భూమి పూజ కోసం కోట్లాది మంది హిందువులు వేచి చూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు ఆలయ నిర్మాణం శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానించాలని ట్రస్ట్ నిర్ణయించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా హాజరవుతారని ట్రస్ట్ తెలిపింది.