కాఫీతోటలోకి చొరబడుతున్నాయని.. అరటిపండ్లలో విషం పెట్టి 20 ఆవుల ప్రాణాలు తీశారు!

20-07-2020 Mon 08:00
  • కర్ణాటకలోని కొడగు జిల్లాలో అమానవీయం
  • ఆవులకు విషం పెట్టి చంపి పూడ్చేసిన వైనం
  • వెల్లువెత్తుతున్న విమర్శలు
Coffee Estate manager killed 20 cows with Banana

కర్ణాటకలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. కాఫీ తోటలోకి ఆవులు చొరబడుతున్నాయన్న కారణంతో అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. అరటి పండ్లలో విషం పెట్టి 20 గోవుల ప్రాణాలు తీశారు. కొడగు జిల్లాలోని ఐగూరు ఎస్టేట్‌లో జరిగిన ఈ దారుణంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సమీప గ్రామాలకు చెందిన పశువులు ఐగూరు ఎస్టేట్‌ వైపు మేత కోసం వెళ్లేవి. ఎస్టేట్‌లోకి ప్రవేశించిన ఆవులు కాఫీ తోటలను పాడు చేస్తున్నాయంటూ ఎస్టేట్ మేనేజర్, ఇతర సిబ్బంది అరటిపండ్లలో విషం పెట్టి గోవులకు తినిపించేవారు. ఆ వెంటనే అవి చనిపోయేవి. అయితే, విషయం బయటపడకుండా ఎస్టేట్‌లోనే పెద్ద గొయ్యి తవ్వి ఆవులను అందులో పూడ్చి పెడుతూ వచ్చారు. ఇలా ఇప్పటి వరకు 20 ఆవుల్ని బలిగొన్నారు.

తమ పశువులు కనిపించకపోవడంతో వాటి యజమానులు వెతుక్కుంటూ నిన్న ఎస్టేట్‌వైపు రాగా,  ఓ గొయ్యిలో వాటి కళేబరాలు కనిపించాయి. అనుమానించిన వారు ఎస్టేట్ సిబ్బందిని నిలదీయడంతో విస్తుపోయే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆవుల యజమానుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.