ICC: నేడు తేలిపోనున్న టీ20 ప్రపంచకప్ భవితవ్యం.. ఐపీఎల్ సంగతి కూడా!

  • తమ వల్ల కాదని ఇప్పటికే చేతులెత్తేసిన ఆస్ట్రేలియా
  • ఐసీసీ నిర్ణయం కూడా అదే అయితే ఐపీఎల్‌కు మార్గం సుగమం
  • ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు
ICC today takes decision on IPL

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ భవితవ్యం నేడు తేలిపోనుంది. నేడు జరగనున్న వర్చువల్ సమావేశంలో ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీ అటో ఇటో తేల్చేయనుంది. కరోనా నేపథ్యంలో ప్రపంచకప్ నిర్వహణ సాధ్యం కాదని ఆతిథ్య దేశం ఆస్ట్రేలియా ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసిన నేపథ్యంలో ఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు, ఐసీసీ నిర్ణయంపైనే ఐపీఎల్ భవితవ్యం కూడా ఆధారపడి ఉంది. టీ20 ప్రపంచకప్ సాధ్యం కాదన్న విషయాన్ని కనుక ఐసీసీ తేల్చేస్తే అదే సమయంలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. ఐసీసీ చైర్మన్‌గా శశాంక్ మనోహర్ ఉన్నంత కాలం ఈ విషయం పడనీయలేదు. ఇప్పుడాయన లేకపోవడంతో ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమమైనట్టేనని చెబుతున్నారు.

మరోవైపు, శశాంక్ మనోహర్ స్థానంలో తదుపరి చైర్మన్‌ను ఎన్నుకునే నామినేషన్ల ప్రక్రియ పైనా నేడు చర్చించే అవకాశం ఉంది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కొలిన్ గ్రేవ్ చైర్మన్ రేసులో ఇప్పటికే నిలవగా, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ పేరు వినిపిస్తున్నప్పటికీ కొన్ని అడ్డంకులు దాదాను అడ్డుకుంటున్నాయి.

More Telugu News