India: ప్రపంచవ్యాప్తంగా కరోనా వికటాట్టహాసం.. మరణాల్లో 8వ స్థానంలో భారత్!

  • ఈ నెలలో మరింతగా చెలరేగుతున్న కరోనా వైరస్
  • సగటున రోజుకు 2 లక్షల కేసులు
  • అమెరికా, బ్రెజిల్, ఇండియా వంటి పెద్ద దేశాలతోపాటు చిన్నదేశాల్లోనూ వణికిస్తున్న వైరస్
India 8th place in Corona Deaths

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా తన విజృంభణను కొనసాగిస్తోంది. ఈ నెలలో రోజుకు సగటున 2 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్నటి వరకు ప్రపంచవ్యాప్తంగా 1.45 కోట్ల కేసులు నమోదు కాగా, 6 లక్షల మందికిపైగా కరోనా కాటుకు బలయ్యారు. రికార్డు స్థాయిలో నిన్న ఒక్క రోజే 2,54,381 కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

ఇక, అత్యధిక కేసుల జాబితాలో ప్రపంచంలోనే తొలి నాలుగు స్థానాల్లో ఉన్న అమెరికా, బ్రెజిల్, ఇండియా, రష్యాలలో వైరస్ మరింతగా చెలరేగిపోతోంది. పెరూ, చిలీ వంటి చిన్న దేశాల్లోనూ కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక, అత్యధిక మరణాలు సంభవిస్తున్న తొలి ఐదు దేశాల్లో అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, మెక్సికో, ఇటలీ ఉండగా, ఇండియా ఎనిమిదో స్థానంలో ఉంది.

అమెరికాలో కరోనాకు అడ్డుకట్టపడడం లేదు. నిన్నటికి ఇక్కడ 38.61 లక్షల కేసులు నమోదు కాగా, 1.42 లక్షల మంది మృతి చెందారు. కరోనాకు ఎపి సెంటర్‌గా మారిన న్యూయార్క్‌లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు 4 లక్షల కేసులు నమోదు కాగా, 32 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

ఇక, మరణాల్లో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో పరిస్థితులు రోజురోజుకు మరింతగా దిగజారుతున్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు 20.76 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 78 వేలమందికిపైగా మృత్యువాత పడ్డారు. కేసుల పరంగా రష్యా నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ, 12 వేల మరణాలతో 11వ స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికాలోనూ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతున్నా, మరణాల విషయంలో మాత్రం 22వ స్థానంలో ఉంది. మరణాల్లో నాలుగో స్థానంలో ఉన్న మెక్సికోలో ఇప్పటి వరకు 39 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్ తర్వాత అత్యధికంగా బ్రిటన్‌లో 45 వేల మందికిపైగా మృతి చెందారు.

More Telugu News