సూపర్బ్ పెర్ఫార్మెన్స్... తమిళ చిత్రంపై మహేశ్ బాబు ప్రశంసలు

19-07-2020 Sun 13:32
  • ఓ మై కడవులే చిత్రాన్ని వీక్షించిన మహేశ్ బాబు
  • దర్శకుడు అశ్వత్, హీరో అశోక్ లకు అభినందనలు
  • ఉబ్బితబ్బిబ్బయిన చిత్ర యూనిట్
Mahesh Babu appreciates a Tamil cinema

కరోనా పరిస్థితుల కారణంగా షూటింగులేవీ లేకపోవడంతో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంటికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో ఆయన ఓ మై కడవులే అనే తమిళచిత్రాన్ని ఇంట్లోనే వీక్షించారు. ఈ సినిమా చూసిన తర్వాత తన స్పందన వ్యక్తం చేయకుండా ఉండలేకపోయారు. సినిమాలో ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదించానని వెల్లడించారు. నటీనటులు అద్భుతమైన నటన ప్రదర్శించారంటూ కొనియాడారు. కథారచన, దర్శకత్వం బ్రిలియంట్ గా ఉంది అంటూ దర్శకుడు అశ్వత్ ను అభినందించారు. ఈ సినిమాలో హీరో అశోక్ సెల్వన్ జీవించేశాడు అంటూ మహేశ్ బాబు ప్రశంసల జల్లు కురిపించారు.

మహేశ్ బాబు అంతటివాడు తన చిత్రంపై స్పందించేసరికి హీరో అశోక్ సెల్వన్ ఉబ్బితబ్బియ్యాడు. థాంక్యూ సర్, మీరు మా సినిమా చూశారనగానే ఇక్కడ డ్యాన్స్ చేసేస్తున్నాను అంటూ హర్షం వ్యక్తం చేశారు. దర్శకుడు అశ్వత్ కూడా ఇదే తరహాలో బదులిచ్చాడు. మీ అభినందనలతో నా మైండ్ బ్లాక్ అయిపోయింది సర్, నేను మీకు పెద్ద ఫ్యాన్ ని అంటూ ట్వీట్ చేశాడు. అశ్వత్ దర్శకత్వంలో అశోక్ సెల్వన్, రితికా జంటగా నటించిన ఓ మై కడవులే చిత్రం ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.