తమిళ నటుడు అజిత్ ఇంట్లో బాంబు పెట్టినట్టు ఫోన్.. ఉరుకులు, పరుగులు పెట్టిన పోలీసులు

19-07-2020 Sun 09:55
  • బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో ఉత్తుత్తి బాంబు బెదిరింపుగా గుర్తింపు
  • ప్రముఖుల ఇళ్లలో బాంబు పెట్టినట్టు తరచూ ఫోన్లు
  • పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు
Bomb scare at Ajiths Injambakkam home in Chennai

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు నిన్న సాయంత్రం చెన్నైలోని పోలీస్ కంట్రోల్‌ రూముకు ఫోన్ చేసి అజిత్ ఇంట్లో బాంబు పెట్టినట్టు చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన నీలాంగరై పోలీసులు ఉరుకులు పరుగులపై నటుడి ఇంటికి చేరుకుని తనిఖీలు చేపట్టగా ఎలాంటి బాంబు లేదని, అది ఉత్తుత్తి బెదిరింపేనని తేలింది.

మరోవైపు, బాంబు ఉందని ఫోన్ చేసిన వ్యక్తి కోసం ఫోన్ నంబరు ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు విళుపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నుంచి ఈ ఫోన్ వచ్చినట్టు గుర్తించారు. అతడు కంట్రోల్‌ రూముకు తరచూ ఫోన్ చేసి ప్రముఖుల ఇళ్లలో బాంబు పెట్టినట్టు చెప్పడం అలవాటుగా మార్చుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇలా ఫోన్లు చేసి ఇప్పటికే పలుమార్లు జైలు శిక్ష అనుభవించినప్పటికీ బుద్ధి మార్చుకోలేదని, ఇటీవల జామీనుపై బయటకు వచ్చి మళ్లీ ఫోన్లు మొదలుపెట్టినట్టు చెప్పారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.