Kidney Racket: ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో టాపర్.. మంచి సంస్థలో ఉద్యోగం.. జల్సాల కోసం కిడ్నీ బ్రోకర్‌గా మారిన యువకుడు!

  • షేర్ మార్కెట్‌లో రూ. 11 లక్షలు పెట్టి నష్టపోయిన నిందితుడు
  • స్వయంగా తన కిడ్నీని రూ. 4.70 లక్షలకు అమ్ముకున్న వైనం
  • ఆ తర్వాత కిడ్నీ రాకెట్‌లోకి ప్రవేశం.. వచ్చిన డబ్బుతో జల్సాలు
Engineering topper caught in Kidney racket case

చెడు అలవాట్లు మనిషిని ఎంతలా అథఃపాతాళానికి తొక్కేస్తాయో చెప్పేందుకు ఇది మంచి ఉదాహరణ. ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌ టాపర్‌గా నిలిచిన యువకుడు ఓ మంచి సంస్థలో ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అయినప్పటికీ జల్సాలకు మరిగి చెడు అలవాట్లకు లోనయ్యాడు. మంచి భవిష్యత్తు ఉన్న అతడు ఇప్పుడు కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా అరండల్‌పేటకు చెందిన గోగిపర్తి షణ్ముఖ పవన్ శ్రీనివాస్ అలియాస్ శ్రీనివాస్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో 93 శాతం మార్కులతో టాపర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బెంగళూరులోని హెచ్ఏఎల్‌లో ఆరు నెలలపాటు పనిచేశాడు.

ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్‌లోని రాంకోఠిలో బీపీవో కార్యాలయం ఏర్పాటు చేశాడు. అందులో నష్టాలు రావడంతో ఆదిభట్లలోని టాటా కంపెనీలో చేరాడు. అదే సమయంలో హైదరాబాద్‌లో స్థలం కొనుగోలు చేయాలంటూ తన బావ ఇచ్చిన 11 లక్షల రూపాయలను షేర్లలో పెట్టాడు. అందులో కూడా నష్టాలు పలకరించడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఇంటర్నెట్‌లో వెతుకుతుండగా కిడ్నీ కావాలంటూ కనిపించిన కొన్ని ప్రకటనలు చూశాడు. దీంతో పూణెలోని మధ్యవర్తి ద్వారా తన కిడ్నీని రూ.4.70 లక్షలకు విక్రయించాడు.

ఈ క్రమంలో తనకు పరిచయమైన నందకిశోర్ అనే వ్యక్తితో కలిసి కిడ్నీ వ్యాపారంలోకి దిగాడు. ఇంటర్నెట్ ద్వారా దాతలను గుర్తించి వారికి పూణెలో పరీక్షలు నిర్వహించిన అనంతరం శ్రీలంక, టర్కీ‌లోని ఆసుపత్రులతో మాట్లాడుకుని దాతలను, కిడ్నీ స్వీకర్తలను అక్కడికి తీసుకెళ్లి కిడ్నీ మార్పిడి చేయించేవాడు. వచ్చిన డబ్బులతో గోవా వెళ్లి జల్సాలు చేసి వచ్చేవాడు. ఈ క్రమంలో 2016లో అహ్మదాబాద్ కిడ్నీ రాకెట్‌ కేసులో పట్టుబడిన వీరిద్దరూ రెండున్నరేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించారు.

తాజాగా, మరో కేసులో పట్టుబడడంతో కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగుచూసింది. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీకి చెందిన బిజ్జాల నాగరాజు అనే వ్యక్తికి రెండు కిడ్నీలు పాడయ్యాయి. దీంతో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడికి శ్రీనివాస్ పరిచయం కాగా టర్కీలో కిడ్నీలు మార్పిడి చేయిస్తానని చెప్పి స్నేహితుడు సృజన్‌తో కలిసి అతడి నుంచి రూ. 34 లక్షలు వసూలు చేశాడు. అయితే, రోజులు గడుస్తున్నా విమాన టికెట్లు తీసుకోకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగు చూసింది.

More Telugu News