Nara Lokesh: చెన్నైలో ఒకే అడ్రెస్ తో ఉన్న నాలుగు కంపెనీలకు వైఎస్ కుటుంబీకులే డైరెక్టర్లు: లోకేశ్

  • చెన్నై  నుంచి డబ్బు మారిషస్ వెళుతోందా? అంటూ సందేహం
  • హవాలా మార్గంలో వెళ్లేది నిజమేనా అంటూ లోకేశ్ అనుమానం
  • ఏ1, ఏ2 గతచరిత్ర మొత్తం ఇదేనంటూ విమర్శలు
Lokesh responds on money seized in Tamilnadu

తమిళనాడులో ఓ కారులో రూ.5.27 కోట్ల నగదు పట్టుబడడంపై నారా లోకేశ్ తన విమర్శల్లో పదును పెంచారు. ఏపీలో కొల్లగొట్టిన కోట్ల కొద్దీ నల్లధనాన్ని వైసీపీ నేతలు ఎమ్మెల్యే స్టిక్కర్లు అంటించిన కార్లలో చెన్నైకి చేరవేస్తున్న విషయం బయటపడిందని తెలిపారు. అయితే అలా వెళుతున్న డబ్బు ఎవరిది? ఆ డబ్బు చెన్నై నుంచి మారిషస్ కు హవాలా మార్గంలో వెళ్లేది నిజమేనా? అనేది ఇప్పుడు తేలాల్సిన విషయం అని పేర్కొన్నారు.

"చెన్నైలో ఒకే చిరునామాతో ఉన్న ఫారెస్ ఇంపెక్స్, క్వన్నా ఎగ్జిమ్స్, వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ తదితర కంపెనీలకు వైఎస్ కుటుంబ సభ్యులైన వైఎస్ భారతీ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. హవాలాకు కేంద్రంగా ఉన్న వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ సంస్థ రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన అడ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డిది. ఈ సంస్థను వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019 సెప్టెంబరు 20న రిజిస్టర్ చేశారు. అంటే అది సూట్ కేసు సంస్థే కదా!

అక్రమంగా దోచుకోవడం, సూట్ కేసు సంస్థలు పెట్టి వాటిలోకి మళ్లించడం, అక్కడి నుంచి హవాలా మార్గంలో విదేశాలకు తరలించడం... ఏ1, ఏ2ల గత చరిత్ర మొత్తం ఇదే! ఇప్పుడు కూడా అదే నడుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ప్రజలకు వాస్తవాలు తెలియాలి" అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

More Telugu News