తమిళనాడు అంతటా బాలినేనిపై వార్తలు ప్రసారమయ్యాయి: చంద్రబాబు

18-07-2020 Sat 17:30
  • ఏపీ నుండి అక్రమంగా నగదు తరలిపోతోందన్న చంద్రబాబు
  • నిందితులకు బదులు ఇతరులను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపణ
  • మీ గురుతర జోక్యం అవసరం అంటూ గవర్నర్ కు లేఖ
Chandrababu writes to AP Governor on latest issues

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. తమిళనాడులో కారులో డబ్బు పట్టుబడిన వ్యవహారాన్ని చంద్రబాబు తన లేఖలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ నుండి భారీ మొత్తంలో అక్రమంగా నగదు తరలిస్తున్నారని, అయితే నిందితులపై సమగ్ర విచారణ చేయకుండా ఇతరులను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు.

ఇటీవల పట్టుబడిన డబ్బుకు సంబంధించి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై తమిళనాడు అంతటా మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయని, కానీ ఆ వ్యవహారంలో సందీప్, చంద్రశేఖర్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారని చంద్రబాబు వెల్లడించారు. అరెస్ట్ చేసిన ఇద్దరినీ అనేక పోలీస్ స్టేషన్లు మార్చుతూ దారుణంగా కొట్టారని ఆరోపించారు. అంతేకాకుండా, ఏపీలో చట్టవిరుద్ధమైన అరెస్టులు, వేధింపులు చోటుచేసుకుంటున్నాయని చంద్రబాబు తన లేఖలో తెలిపారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ని అతిక్రమిస్తున్నారని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తున్నారని, పోలీసులు సోషల్ మీడియా వేదికగా అమానవీయ, అనాగరిక ధోరణి కనబరుస్తున్నారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగ పరిరక్షణకు మీ జోక్యం అవసరం అంటూ గవర్నర్ ను కోరారు. మీ గురుతర జోక్యం మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా, వ్యవస్థలపై యువతలో నమ్మకాన్ని కలిగిస్తుందని చంద్రబాబు గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు.