ఇప్పటికే ఎంపికైన వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా మరో నోటిఫికేషన్ ఏమిటి?: లోకేశ్

18-07-2020 Sat 14:14
  • నిరుద్యోగులకు జగన్ అన్యాయం చేస్తున్నారని విమర్శలు
  • నిరుద్యోగులు దగా పడుతూనే ఉన్నారన్న లోకేశ్
  • అర్హులతో సచివాలయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్
Lokesh demands fill up secretariat post with deserved candidates

సీఎం జగన్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శించారు. యువనేస్తం నిరుద్యోగ భృతి ఎత్తేయడం, సచివాలయ ఉద్యోగాల పరీక్ష పేపర్ లీకేజి నుంచి ఈ రోజు వరకు నిరుద్యోగులు దగా పడుతూనే ఉన్నారని తెలిపారు. గ్రామ సచివాలయం ఉద్యోగ నియామక పరీక్షలో అర్హత సాధించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లు సుమారు 10 వేల మంది ఉన్నారని లోకేశ్ వివరించారు.

మొదటి నోటిఫికేషన్ ద్వారా సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అవకాశం కల్పించకుండా రెండో నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న పోస్టులకు, ప్రభుత్వం అదనంగా ప్రకటించిన 3 వేల సచివాలయ ఉద్యోగాలకు అర్హులు ఉండగా, మరో నోటిఫికేషన్ ఎందుకు ప్రకటించారు? అర్హత సాధించిన వారందరికీ ఉద్యోగం కల్పిస్తామన్న జగన్ రెడ్డి హామీ ఏమైంది? అంటూ నిలదీశారు. అర్హత సాధించి మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులతో తక్షణమే పోస్టులు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.