ఏపీకి మూడు రాజధానులు కావాలంటే విభజన చట్టంలో సవరణ అవసరం: యనమల

18-07-2020 Sat 13:19
  • రాజధాని కేంద్రం పరిధిలో అంశమని వెల్లడి
  • విభజన చట్టంలో రాజధాని అని మాత్రమే ఉందన్న యనమల
  • రాజధానులు అని ఎక్కడా చెప్పలేదని వ్యాఖ్యలు
Yanamala said if three capitals for state there should be a correction in bifurcation act

ఏపీలో పరిపాలన వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల ఏర్పాటుకు సర్కారు సన్నద్ధమవుతుండడం పట్ల టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. రాష్ట్ర విభజన సందర్భంగా రూపొందించిన చట్టంలో రాజధాని అని మాత్రమే ఉందని, ఆమేరకు శివరామకృష్ణ కమిటీ నివేదిక అనుసరించి అమరావతిని ఎంచుకున్నారని తెలిపారు.

అంతేతప్ప, విభజన చట్టంలో ఎక్కడా రాజధానులు అనే మాట లేదని, ఇప్పటి ప్రభుత్వం కోరుకుంటున్నట్టుగా మూడు రాజధానులు చేయాలంటే మాత్రం విభజన చట్టంలో ఆ మేరకు సవరణ అవసరం అని స్పష్టం చేశారు. రాజధాని ఏర్పాటు అనేది కేంద్రం పరిధిలోని అంశమని పేర్కొన్నారు. కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ సిఫారసుల ఆధారంగానే రాజధాని ఏర్పాటు కావాలని విభజన చట్టంలో ఉందని యనమల తెలిపారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.