శ్రీవారి సేవలు ఒక్క రోజు ఆపినా మానవ జాతికి మంచిది కాదు: రమణ దీక్షితులు

17-07-2020 Fri 21:51
  • తిరుమల శ్రీవారి క్షేత్రంలో కరోనా కలకలం
  • అర్చకులకు కరోనా పాజిటివ్
  • స్వామివారి ఆరాధన ఒక్కరోజు కూడా ఆపరాదన్న రమణదీక్షితులు
Ramana Deekshitulu comments on Tirumala situation amidst corona pandemic

తిరుమల క్షేత్రంలో అర్చకులు సైతం కరోనా బారినపడ్డారని సాక్షాత్తు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించడంతో అన్ని వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, కరోనా బారినపడిన అర్చకుల స్థానంలో టీటీడీ అనుబంధ ఆలయాల నుంచి అర్చకులను శ్రీవారి సేవల కోసం తీసుకురావాలని టీటీడీ భావిస్తోంది. దీనిపై తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు, ఆగమ సలహా మండలి సభ్యుడు రమణ దీక్షితులు స్పందించారు.

శ్రీవారి అర్చకుల స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం సబబు కాదని, శ్రీవారి ఆరాధన సేవలు ఒక్కరోజు కూడా ఆగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. శ్రీవారి సన్నిధిలో కైంకర్యాలు నిలిచిపోవడం మానవాళికి ఏమంత మంచిది కాదని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో కొన్ని వారాల పాటు దర్శనాలు నిలిపివేసి, అర్చకులను రక్షించుకోవాలని రమణ దీక్షితులు సూచించారు. స్వామివారికి ఏకాంతంలో పూజాదికాలు నిర్వహించాలని పేర్కొన్నారు. దీనిపై సీఎం జగన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు.