లాక్ డౌన్ సమయంలో నేను చేసిన పనులు ఇవే: నిధి అగర్వాల్

17-07-2020 Fri 18:07
  • పెంపుడు కుక్కకు వాకింగ్ చేయించడానికి మాత్రమే బయటకు వస్తున్నా
  • ఓ ఆన్ లైన్ యాక్టింగ్ క్లాసులో చేరాను
  • సినిమా సాంకేతిక అంశాలపై  ట్రైనింగ్ తీసుకున్నా
Nidhi Agarwal shares her lockdown experiences

'సవ్యసాచి' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది భామ నిధి అగర్వాల్... 'ఇస్మార్ట్ శంకర్'తో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో రామ్ తో కలసి నిధి సూపర్ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో అశోక్ గల్లా సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు ఆమెకు పలు ఆఫర్లు వస్తున్నాయి.

ఇక, లాక్ డౌన్ కారణంగా హైదరాబాదును వదిలి ఆమె తన ఇంటికి వెళ్లిపోయింది. లాక్ డౌన్ తో షూటింగులకు దూరంగా ఉన్నప్పటికీ... సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేస్తూ తన అభిమానులను నిధి అలరించింది. తాజాగా లాక్ డౌన్ సమయంలో తాను చేసిన పనుల గురించి ఈ చిన్నది వెల్లడించింది.

ప్రతిరోజు తన పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు తాను బయటకు వస్తున్నానని నిధి తెలిపింది. మాస్క్, గ్లౌవ్స్, ఫేస్ షీల్డ్ వేసుకుని బయటకు వస్తున్నానని.. ఇంటికి వచ్చిన వెంటనే కుక్క గొలుసుతో పాటు ప్రతి వస్తువును శానిటైజ్ చేస్తున్నానని చెప్పింది. కుక్కకు స్నానం చేయించి, తాను స్నానం చేస్తున్నానని తెలిపింది. ఇదే సమయంలో ఓ ఆన్ లైన్ యాక్టింగ్ క్లాసులో చేరానని చెప్పింది. అలాగే సినిమాకు సంబంధించిన సాంకేతిక అంశాల గురించి కూడా ట్రైనింగ్ తీసుకున్నానని తెలిపింది.