తెలంగాణ సచివాలయ కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ కొట్టివేత!

17-07-2020 Fri 15:32
  • కొత్త సచివాలయం నిర్మించేందుకు కేసీఆర్ సర్కారు యత్నం
  • పాత సచివాలయం కూల్చివేత ప్రయత్నాలు
  • కూల్చివేతను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్
High Court dismisses petition on Telangana secretariat demolition

తెలంగాణలో పాత సచివాలయం కూల్చివేసి కొత్త సచివాలయం నిర్మించేందుకు కేసీఆర్ సర్కారు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ ను హైకోర్టు ఇవాళ కొట్టివేసింది.

తద్వారా సచివాలయం కూల్చివేతకు ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కూల్చివేతలపై దాఖలైన అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరంలేదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వివరణ ఇవ్వడంతో న్యాయస్థానం దానితో ఏకీభవించింది. దాంతో ఇప్పటివరకు ఏర్పడిన సందిగ్ధత వీడినట్టయింది. పాత భవనాలను కూల్చి కొత్త సచివాలయం నిర్మించాలన్న క్యాబినెట్ నిర్ణయాన్ని కోర్టు సమర్థించినట్టయింది.

విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తమ వాదనలు వినిపిస్తూ... భవనాల కూల్చివేతకు కేంద్రం అనుమతి అవసరంలేదని, నూతనంగా నిర్మాణాలు చేపట్టడానికే కేంద్రం అనుమతులు అవసరమని కోర్టుకు తెలిపారు. కొత్త నిర్మాణం చేపట్టేముందు అన్ని అనుమతులు తీసుకుంటామని చెప్పారు. సొలిసిటర్ జనరల్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ఆపై ప్రభుత్వ అనుకూల నిర్ణయం తీసుకుంది.