రోహిత్ శర్మను అవుట్ చేసేందుకు తహతహలాడుతున్న పాక్ యువ ఫాస్ట్ బౌలర్

17-07-2020 Fri 14:36
  • రోహిత్ అన్నిరకాల బంతులు ఆడతాడంటున్న నసీమ్
  • రోహిత్ ను అవుట్ చేయడం తన కల అని వెల్లడి
  • స్మిత్, రూట్ లను కూడా అవుట్ చేయాలనుకుంటున్నట్టు వివరణ
Pakistan speedster Naseem Shah eager to bowl Rohit Sharma

ప్రతిభావంతులకు లోటులేని పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు నిలకడ ఒకటే తక్కువ. గెలిచినా, ఓడినా పాక్ జట్టులో తమదైన ఆటతీరుతో కొందరు యువ ఆటగాళ్లు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవల ఆ జట్టులో అత్యంత మెరుగైన ప్రదర్శన చేస్తున్న యువ పేసర్ నసీమ్ షా. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కోసం పాక్ సన్నద్ధమవుతుండగా, నసీమ్ షా కూడా ఇంగ్లాండ్ గడ్డపై సన్నాహాల్లో మునిగితేలుతున్నాడు. తాజాగా ఓ క్రికెట్ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

భారత డాషింగ్ క్రికెటర్ రోహిత్ శర్మను అవుట్ చేయాలన్నది తన కల అని తెలిపాడు. అన్ని రకాల బంతులను ఎదుర్కోగల రోహిత్ వంటి ఆటగాడ్ని అవుట్ చేస్తే ఎంతో సంతోషం కలుగుతుందని చెప్పాడు. ఎన్నో బ్యాటింగ్ రికార్డులు సొంతం చేసుకున్న రోహిత్ శర్మను అవుట్ చేస్తే తన కల నిజమైనట్టేనని అన్నాడు. అంతేకాదు, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఇంగ్లాండ్ టెస్టు జట్టు సారథి జో రూట్ లను కూడా అవుట్ చేయాలని కోరుకుంటున్నట్టు నసీమ్ షా తెలిపాడు.

స్టీవ్ స్మిత్ కు సంప్రదాయేతర బ్యాటింగ్ టెక్నిక్ ఉందని, గతంలో ఓసారి ఆడినా స్మిత్ ను అవుట్ చేయలేకపోయానని వివరించాడు. అయితే, వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ జరగనున్న నేపథ్యంలో రూట్ ను అవుట్ చేసే అవకాశం నసీమ్ షా ముందు నిలిచింది.