Disha: దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఘటనపై విచారణ కొనసాగుతుంది: విచారణ కమిషన్

  • నాడు సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం
  • నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు
  • ఘటనపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు
  • కరోనా ప్రభావంతో కమిషన్ కార్యకలాపాలకు ఆటంకాలు
Commission on Disha encounter will continue work despite corona pandemic

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం ఘటనలో నలుగురు నిందితులనూ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ పై సుప్రీం కోర్టు అప్పట్లోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ ఘటన పూర్వాపరాలు, ఘటనకు దారితీసిన కారణాలు, ఘటన తీరుతెన్నులపై నిగ్గు తేల్చేందుకు కమిషన్ రెండు పర్యాయాలు సమావేశమైంది. అనేకమంది సాక్షులను, ఆధారాలను, రికార్డులను పరిశీలించింది. అయితే, కరోనా ప్రభావంతో విచారణ కమిషన్ కార్యకలాపాలకు అవాంతరాలు ఏర్పడ్డాయి. దీనిపై విచారణ కమిషన్ కార్యదర్శి ఎస్.శశిధర్ రెడ్డి మీడియాకు ఓ ప్రకటన ద్వారా సమాచారం అందించారు.

కరోనా వ్యాప్తి నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పరిస్థితులు కొనసాగిస్తున్నప్పటికీ విచారణ కమిషన్ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. దిశ ఘటనతో సంబంధం ఉన్న వ్యక్తుల నుంచి కీలక పత్రాలు, రికార్డులు, వాంగ్మూలాలు స్వీకరించడం ఇకపైనా కొనసాగుతుందని వివరించారు. ఈ సమాచారాన్ని కమిషన్ సభ్యులందరికీ పంపడం జరిగిందని తెలిపారు.

లాక్ డౌన్ నేపథ్యంలో ఆన్ లైన్ లో విచారణ కొనసాగించేందుకు ఉన్న అన్ని మార్గాలను కమిషన్ పరిశీలించిందని, అయితే, అనేక మంది వ్యక్తులను విచారించాల్సి ఉండడంతో పాటు, వారి వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచాల్సి ఉన్నందున, వారికి భద్రత కల్పించాల్సి ఉన్నందున ఆన్ లైన్ విచారణ సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చామని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు.

పైగా ఈ విచారణలో ఘటన జరిగిన ప్రాంతానికి కూడా వెళ్లాల్సి ఉండడంతో, ఆన్ లైన్ విచారణ అనుకూలం కాదని భావించామని పేర్కొన్నారు. కొన్ని కోర్టులు వర్చువల్ హియరింగ్స్ చేపడుతున్నా, వాటికి కూడా సమస్యలు వస్తున్నాయని గుర్తించామని, అయినప్పటికీ, ప్రతికూల పరిస్థితులు ఉన్నాగానీ విచారణ కమిషన్ కార్యకలాపాలను, విచారణను ముందుకు తీసుకెళ్లాలనే భావిస్తున్నామని, అందుకు అనువైన మార్గాలను పరిశీలిస్తున్నామని వివరించారు.

More Telugu News