భారత్-చైనా వివాదంపై మరోసారి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు

17-07-2020 Fri 10:57
  • భారత ప్రజలను ఇష్టపడతాను
  • అలాగే, చైనా ప్రజలనూ ఇష్టపడతాను
  • శాంతియుతంగా ఉండడానికి అవసరమైన ప్రతి పని చేస్తా
Donald Trump about india china conflict

భారత్, చైనా మధ్య నెలకొన్న పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. తాను భారత ప్రజలతో పాటు చైనా ప్రజలనూ ఇష్టపడతానని ఆయన చెప్పారు. ప్రజలు శాంతియుతంగా ఉండడానికి అవసరమైన ప్రతి పని చేస్తానని అన్నారు. ఇరు దేశాల మధ్య శాంతి కోసం తన శక్తి మేరకు కృషి చేస్తానని చెప్పారు. ఈ విషయాన్ని వైట్‌ హౌస్‌ అధికార ప్రతినిధి కేలీ మెకనీ మీడియాకు తెలిపారు.
 
కాగా, భారత్‌-చైనా దేశాల గురించి వైట్‌ హౌస్‌‌ ఆర్థిక సలహాదారుడు లారీ కుడ్లో కూడా మీడియాతో మాట్లాడారు. తమ దేశానికి భారత్‌ అతిపెద్ద ఆర్థిక భాగస్వామి అని, చైనాతో భారత్‌కు పొంచి ఉన్న ముప్పుపై తాము చర్చించామని అన్నారు.

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు డాక్టర్‌ ఓబ్రియెన్ ఇదే విషయంపై స్పందిస్తూ.. భారత్‌ విషయంలో డ్రాగన్‌ దేశం దుందుడుకుగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. అమెరికా మాజీ అధ్యక్షులతో పోలిస్తే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్‌కు బాహాటంగానే మద్దతుగా నిలుస్తున్నారని మరో అధికారి‌ అల్‌ మేసన్ తెలిపారు.